20-3-2010
- మెరవని భారతీయ ఫండ్లు
2010లో కేవలం ఐదు ఫండ్లు మాత్రమే జారీకాబడ్డాయి. అయితే వీటిపట్ల మదుపుదారుల ఆసక్తి కానరావడం లేదు. విదేశీ మదుపుదారులు అంతగా ఆసక్తి కనపరచని 2009 సంవత్సరం మాదిరిగానే 2010 తొలి రెండు నెలల్లో ప్రవేశపెట్టబడిన ఇష్యూల పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ఈ ఇష్యూల ద్వారా కేవలం 49.20 కోట్ల డాలర్లు మాత్రమే సమకూరాయి. ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ (పిఇ) ఎస్సెంట్ క్యాపిటల్ మాత్రమే గ్రోత్ క్యాపిటల్‌పై దృష్టి సారించి పెద్ద ఎత్తున్న నిధులను సేకరించగలిగింది. ఎస్సెంట్ ఇండియా ఫండ్-3 ద్వారా దాదాపు 35 కోట్ల డాలర్లను సమీకరించగలిగింది. ఇది అధికంగా సబ్‌స్క్రైబ్ అయినప్పటికి, పరిమితిని పెంచడానికి భాగస్వాములు ఇష్టపడలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో భారత్‌కు అంకితమైన నిధులను సేకరించే ఒక ఇండియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ఫండ్ మేనేజర్ తన గుర్తింపు వెల్లడి చేయకూడదనే షరతుపై మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ల పెట్టుబడిదారులు నిధుల విస్తృతీకరణ పట్ల ఆసక్తి కనపరుస్తున్నారని తెలిపారు. అందువల్ల అనేక మంది వర్ధమాన మార్కెట్లలోను, బ్రిక్ ఫండ్స్‌లోను (కార్పస్‌లో కొంత భాగం భారతీయ మార్కెట్‌లో పెట్టుబడిచేసే) మదుపుచేస్తున్నారు. వారిలో కొందరు సింగల్ మార్కెట్ ఫండ్స్‌కు బదులుగా వివిధ ఫండ్స్‌లో పెట్టుబడిచేయడానికి ఆసక్తి కన పరుస్తున్నారు. ఆసియాలోని పిఇ పెట్టుబడుల దృక్పధం ప్రకారం సిడిసి గ్రూప్ ఆసియా టీమ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుభ శ్రీవాత్సవ మాట్లాడుతూ 'పిఇ ఫండ్ల పరిస్థితి ఫండ్ మేనేజర్లు అంతగా ఆసక్తికనపరచని గత సంవత్సరం కన్నా 2010 మొత్తం మీద సానుకూలంగా ముందుకు రాగలరని నేను భావిస్తున్నాను' అని అన్నారు. ఆసియాలో చురుకుగా ఉన్న సిడిసి వంటి పెట్టుబడిదారులు మరిన్ని నిధుల ప్రతిపాదనలను పరిశీలించడానికి సిద్ధపడుతున్నారని ఆయన అన్నారు. ఇండియా ఫండ్ గురించి బ్లూబెర్గ్ చూపుతున్న గణాంకాల ప్రకారం 2009లో కేవలం 14 ఫండ్స్ మాత్రమే ప్రవేశపెట్టబడ్డాయి. విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించిన 2006 బూమ్ కాలంలో దాదాపు 25 ఫండ్లు 900 కోట్ల డాలర్లకు పైగా సమీకరించగలిగాయి. 2007లో 38 ఫండ్ల ద్వారా 330 కోట్ల డాలర్లను సమీకరిం చడం జరిగింది. అయితే ఆ తరువాత 2008లో 43 ఫండ్ల ద్వారా 220 కోట్ల డాలర్ల మేర మాత్రమే ఇండియా ఫండ్స్ పెరిగాయి. 2005లో యుపిఎ ప్రభుత్వ తొలి సంవత్సరంలో విదేశీ పెట్టుబడులు 320 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.