ఇన్‌ ఫ్రా ఫండ్స్‌దే హ్వా
కేంద్ర ప్రభుత్వం మౌలిక వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని పెడుతుండడంతో ఈ రంగానికి మద్దతిస్తున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌ కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో ముందుంటున్నాయి. అన్ని రంగాల అభివృద్దితో పాటు మౌలిక రంగం అనుకోకుండా మౌలిక రంగ వృద్ధితోనే అన్ని రంగాల అభివృద్ధి అని భావిస్తేనే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ప్రభుత్వం కూడా త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ దిశగా కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది. దేశీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌ పీర్‌ గ్రూప్‌లో బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి మూడు సంవత్సరాల క్రితం మార్కెట్‌ను తాకిన బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ మౌలిక రంగంలోని ఫండ్స్‌లో మంచి లాభాలను అందిస్తున్న ఫండ్‌గా నిలిచింది. ఒక్కసారి ఎన్నికల ముందు ఫలితాలను పరిశీలిస్తే ఫండ్‌ మేనేజర్లు కేంద్రంలోని ప్రభుత్వ విధానాల పట్ల కాస్తంత విముఖతనే ప్రదర్శించారని చెప్పవచ్చు. దేశీయ షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఫండ్‌ మేనేజర్లు వెనక్కు తగ్గారు. ఈ సంవత్సరం మార్చి నాటికి గత సంవత్సరంతో పోలిస్తే ఫండ్‌ కంపెనీల క్యాష్‌ లెవల్స్‌ 20 నుంచి 5 శాతానికి తగ్గాయి. దీనికి కారణాలు ఎన్నో ఉన్నా మౌలిక రంగంలో మాత్రం పెట్టుబడులు కొనసాగాయి. అందువల్లే మాంద్యం, బేరిష్‌ రన్‌ మార్కెట్‌ను పీడించినా కొన్ని స్టాక్స్‌్‌ మంచి రిటన్స్‌ ఇన్వెస్టర్లకు అందించాయి. లార్జ్‌కాప్‌ సెక్టార్‌లోని ఈక్విటీల కన్నా మిడ్‌కాప్‌పై ఫండ్‌ కంపెనీలు దృష్టిని సారించాయి.విశ్లేషకుల కధనం ప్రకారం ప్రపంచ దేశాలు మాంద్యం ప్రభావం నుంచి రికవరీ సాధించాలంటే భారత్‌లో వృద్ధి చాలా కీలకం. ఎందుకంటే అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలను గడగడలాడించిన ఆర్థిక సంక్షోభం భారత్‌పై చూపిన ప్రభావం చాలా స్వల్పం. భారత్‌ నుంచి ఎగుమతులు అధికంగా ఉండడం, అతిపెద్ద రిటైల్‌ మార్కెట్‌ను కలిగివుండడం భారత్‌ను ఆదుకున్నాయని చెప్పవచ్చు. అందువల్లే గత సంవత్సరం భారత్‌లో 6 శాతం కన్నా అధిక వృద్ధి రేటు నమోదయింది. ఈ సంవత్సరం సైతం అంతకుమించే వృద్ధి నమోదవుతుందని ఇప్పటికే అంచనాలు వెలువడ్డాయి.మౌలిక రంగం అభివృద్ధికి ప్రైవేటు ఇన్వెస్టర్లే కీలకం.గడచిన మూడు సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో మొత్తం 117 ఒప్పందాలు కుదిరాయి. అంతకుముందు ఐదు సంవత్సరాల్లో కుదిరిన ఒప్పందాల సంఖ్య 104 మాత్రమే. 10వ పంచవర్ష ప్రణాళికలో 17 శాతంగా ఉన్న పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టులను 11వ పంచవర్ష ప్రణాళికలో 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల 2008 నుంచి 2012 మధ్య కనీసం 500 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు మౌలిక రంగంలోకి తరలబోతున్నాయన్నమాట. ఇదే జరిగితే భారత్‌ మళ్ళీ 9 శాతం వృద్ధిని అధిగమిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.వచ్చే 18 నెలల కాలంలో ఇన్‌ఫ్రా ఫండ్లు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించనున్నాయని బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈక్విటీ కో-హెడ్‌ మహేష్‌ పాటిల్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశీయ ఇన్‌ఫ్రా కంపెనీలు మాంద్యం బారినుంచి బయటపడ్డాయని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగ సృష్టి, వ్యాపార, వాణిజ్య రంగాలకు మద్దతు, వినియోగదారుడిలో నమ్మకం పెంచే విషయాల్లో భారత్‌ ఇప్పటికే చాలా దేశాలకన్నా ముందు నిలిచింది. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదైతే ఈ నమ్మకం మరింతగా పెరుగుతుందని పాటిల్‌ అన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గ్రోత్‌ భారత ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తుందని, ప్రస్తుతం దేశంలో తక్కువ వడ్డీరేట్లకే పరిశ్రమలకు రుణాలు లభిస్తున్నాయని, దీన్ని ఎస్‌ఎంఇలు అందివచ్చిన వరంగా భావించి అభివృద్ధి పథంలో ముందంజ వేయాలని ఆయన సూచించారు. పవర్‌, కన్‌స్ట్రక్షన్‌, రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌, సెజ్‌ సెక్టార్లు బాగా లాభాలను ఆర్జించబోతున్నాయని ఆయన అంచనా వేశారు.కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రస్తుతం సరైన సమయంగా భావించవచ్చని ఆయన అన్నారు. చాలా ఈక్విటీ షేర్లు, ఫండ్స్‌ ఆకర్షణీయమైన ధరల్లో ఊరిస్తున్నాయని ఆయన అన్నారు. సంక్షోభం కారణంగా ఎంతో నష్టపోయిన ఆతిధ్యరంగం ఆధారంగా పనిచేస్తున్న కంపెనీల విలువ ప్రస్తుతం కనిష్ఠస్థాయిల్లో ఉందని, ఒకసారి మాంద్యం పూర్తిగా అంతమైతే ఈ కంపెనీలు శరవేగంతో పైకి వస్తాయని ఆయన అన్నారు. ఇన్వెస్టర్లు కంపెనీల ఈక్విటీలను కొనుగోలు చేయడం కన్నా ఇన్‌ప్రా ఫండ్స్‌లో లాభాలను ఎక్కువగా పొందవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లోని పెట్టుబడులను అన్ని రంగాల్లోనూ పెడుతున్నామని ఆయన తెలిపారు. అటు లార్జ్‌ కాప్‌ కంపెనీలతో పాటు, మిడ్‌కాప్‌లోనూ ఫండమెంటల్స్‌ బాగున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లకు లాభాలను చేకూరుస్తున్నామని ఆయన తెలిపారు. ఈక్విటీ మార్కెట్లలో రాబడుల కన్నా తమ ఫండ్‌ ద్వారా మిడ్‌కాప్‌ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు మంచి ఆదాయాన్ని అందించాయని ఆయన వివరించారు.ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఐదేళ్ళపాటు స్థిరంగా పరిపాలిస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని, అందువల్లే సెంటిమెంట్‌ పెరిగి కనిష్ఠస్థాయిల్లో ఉన్న షేర్‌ మార్కెట్‌ వృద్ధి బాటన నడుస్తోందని పాటిల్‌ అభిప్రాయపడ్డారు. వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో దేశీయ మౌలికరంగ అభివృద్ధికి కనీసం 1.5 లక్షల కోట్ల డాలర్లను వెచ్చించాలని యుపిఎ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. మాంద్యం నుంచి రికవరీ ఆరంభం కావడం, తక్కువ వడ్డీ రేట్లు, అంచనాలను మించుతున్న కార్పొరేట్‌ సంస్థల ఆర్థిక ఫలితాలు, ద్రవ్య లభ్యత, సులభ రుణాలు దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను కొత్త పెట్టుబడుల దిశగా ముందుకు నడిచేందుకు సహకరిస్తున్నాయన్నారు. అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి మంచి రాబడులను పొందాలని పాటిల్‌ సూచించారు.
( Source: AndhraPrabha)
  • ..........................................................................................................................................