08-07-2009
ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్ విడుదల దేశంలోని అతిపెద్ద విదేశీ ఫండ్ హౌస్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మరో కొత్త ఫండ్ ను ఆవిష్కరించింది. ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్ (ఎఫ్‌బిఐఎఫ్‌) పేరిట విడుదలైన ఈ ఫండ్ నిధులను దేశ ఆర్థికవృద్ధికి సహకరించే కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టనున్నామని ఫ్రాంక్లిన్ ఈక్విటీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది . జూలై 10 నుంచి ఆగస్టు 8 వరకూ అందుుబాటులో ఉండే ఈ ఫండ్‌లో ఒక్కో యూనిట్‌ విలువ 10 రూపాయలుగా ఉంటుందని ఆయన తెలిపారు. గడచిన ఐదేళ్ళలో భారత్‌లో గణనీయమైన వృద్ధి నమోదైందని, ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా భారత్‌ సంతృప్తికరమైన వృద్ధిని సాధించిందని, సమీప భవిష్యత్ లోనే రెండంకెల వృద్ధిని నమోదుచేయగల సత్తా ఉన్న భారత్ లో ఈ తరహా ఫండ్స్ మంచి రాబడులను అందించగలవని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా అధ్యక్షుడు హర్షేందు బిందాల్‌ వివరించారు. ఈ ఫండ్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక రాబడులను అందుకోవచ్చని ఆయన తెలిపారు. కొత్త ఎమ్ఎఫ్ లకు రుసుము తగ్గింపు ఈ ఏడాది జులై 1 తరువాత నమోదయ్యే పథకాలకు తక్కువ రుసుము ఉంటుందని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘జులై 1 లేదా ఆ తరువాత తమ పథక సమాచారాన్ని తెలుపుతూ నమోదు(రిజిస్టర్‌) చేసుకునే మ్యూచువల్‌ పథకాలకు సవరించిన రుసుము వర్తిస్తుందని స్పష్టం చేస్తున్న'ట్లు సెబీ పేర్కొంది. జూన్ 18న జరిగిన సమావేశంలో సెబీ(ఎమ్‌ఎఫ్‌) నిబంధనల(1996)ను సవరించినట్లు తెలిపింది. దీని ప్రకారం ఏదైనా కొత్త ఫండ్‌ ఆఫర్‌ సమీకరించే మొత్తంలో 0.002% నుంచి 0.005% మొత్తానికి సమానంగా ఫీజులో కోత ఉంటుంది. ఇది కనీసం రూ.1 లక్ష నుంచి గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు ఉండొచ్చని తెలిపింది. (మూలం : ఈనాడు )