23-12-2009
తీరని కష్టాలు
ఈ ఏడాది మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ మాంద్యం నుంచి బయటపడి రూ.8 లక్షల కోట్ల ఆల్‌టైం గరిష్ఠ స్థాయి ఆస్తులకు చేరుకుంది. అయితేఇది మదుపర్లకు ఉపకరించింది కానీ పరిశ్రమను మాత్రం నీలినీడలు వదల్లేదన్నది సత్యం. సెబీ నిబంధనల్లో మార్పులు తీసుకురావడం ఇందుకు ప్రధాన కారణమైంది. ప్రవేశ రుసుము రద్దుతో.. ఈ ఏడాది సెబీ మ్యూచువల్‌ ఫండ్‌ మదుపర్ల కోసం చాలా నిబంధనల్లో మార్పు తీసుకువచ్చింది. అందులో ప్రధానమైంది ప్రవేశ రుసుమును తీసివేయడం. ఇది మొత్తం ఫండ్ల పంపిణీలోనే పెను మార్పు. దీంతో అటు డిస్ట్రిబ్యూటర్లు, ఫండ్‌ కంపెనీలకు కష్టకాలం ఎదురైంది. మరో పక్క ఎక్సే్ఛంజీల్లో ఫండ్ల ట్రేడింగ్‌కు కూడా సెబీ అనుమతులు ఇవ్వడంతో మదుపర్లు పండ్ల నేరుగా లావాదేవీలు జరపడానికి వీలైంది. ఇది బ్రోకరేజీ సంస్థలకు ఇబ్బంది కలిగించే విషయమే. మరో పక్క ఈక్విటీ మార్కెట్లు వూగిసలాటకు గురికావడం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంతో మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది మొగ్గు చూపారు. దీంతో నవంబరు చివరినాటికి సగటు నిర్వహణ కింది ఆస్తులు(ఏయూఎమ్‌) రికార్డు స్థాయిలో రూ.8,07,546 కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే దాదాపు రూ.3.86 లక్షల కోట్లు పెంచుకోవడం విశేషం. ఇవన్నీ కూడా 2009 ఏడాదిలో ఫండ్‌ సంస్థలకు ఉపయోగపడక పోయినప్పటికీ వచ్చే ఏడాదిపై మాత్రం ఆశలను రేపుతుండడం గమనార్హం. వచ్చే ఏడాది చివరకు మొత్తం ఏయూఎమ్‌లు 25 శాతం పెరుగుతాయన్న అంచనాలున్నాయి. గతేడాది పరిశ్రమ భారీ నష్టాలను కొనితెచ్చుకుంది. ద్రవ్య సంక్షోభం కారణంగా ఫండ్‌ సంస్థలు రూ.1,50,000 కోట్ల మేర ఆస్తులను కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాత్రం 37 సంస్థలతో కూడిన మన ఫండ్‌ పరిశ్రమ ఆస్తుల పరంగా సురక్షిత స్థానంలోనే ఉంది.
స్వల్పకాలం కోసమేనా.. 2010లో ఈక్విటీ ఎమ్‌ఎఫ్‌లు పనితీరు భేషుగ్గా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇంత వరకు ఈక్విటీ పథకాల్లో రూ.2,104 కోట్ల పెట్టుబడులు నమోదవగా.. ఆదాయ పథకాలకు రూ.2,87,500 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. ఆస్తులు భారీ పరిమాణంలో ఉన్నా మదుపర్లు స్వల్పకాలం కోసమే పెట్టుబడులు పెడుతున్నారని మార్కెట్లలో చలనం వస్తే వాటిని బయటకుతీయడానికి వెనుకాడరని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో స్వల్పకాల డెట్‌ ఫండ్లు ఆకర్షణీయంగా మారడాన్ని వారు కారణంగా చూపిస్తున్నారు. దీర్ఘకాల ఈక్విటీ నగదు తరలి వచ్చేంతవరకూ పరిస్థితిలో పెద్ద మార్పు ఉండదని అంటున్నారు. దాదాపు అన్ని ఏయూఎమ్‌లు సైతం మార్కెట్‌ పెరిగిన కారణంగా పెరిగాయే తప్ప తాజా పెట్టుబడుల వల్ల కాదన్నది నిపుణుల వాదన.(ఈనాడు)